ఫాల్కే ఫెస్టివల్‌కు జర్నలిస్టు సురేష్ పిళ్లె షార్ట్ ఫిల్మ్ 'The 3rd'

  • ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన 'ది 3rd' షార్ట్ ఫిల్మ్
  • సీనియర్ జర్నలిస్టు మునిసురేష్ పిళ్లె తొలి దర్శకత్వ ప్రయత్నం
  • కార్పొరేట్ ఒత్తిళ్లు, విద్యార్థుల ఆత్మహత్యల ఇతివృత్తం
  • లెక్చరర్ వేధింపులకు గురైన విద్యార్థిని కథ
  • ఏఐ సహకారంతో స్వరపరిచిన పాటలు
సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన షార్ట్ ఫిలిం "The 3rd" న్యూఢిల్లీలో ఏప్రిల్ 30న జరిగే 16వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2026 లో స్క్రీనింగ్ కు ఎంపికైంది. భారత చలనచిత్ర పితామహుడిగా అందరూ కీర్తించే దాదాసాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ 30న ఢిల్లీలో ఈ ఫెస్టివల్ జరుగుతుంటుంది. ఈ ఏడాది చిత్రోత్సవానికి తెలుగులో సురేష్ పిళ్లె రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం ఎంపికైంది.

ర్యాంకుల ఒత్తిడితో ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాణాలను బలితీసుకునే కార్పొరేట్ జూనియర్ కాలేజీల దుర్మార్గాలు, చదువుల్లో వెనుకబడిన పిల్లలను సూటిపోటిమాటలతో తూట్లు పొడిచే లెక్చరర్ల వైఖరి కథాంశంగా ఈ 40 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిలిం రూపొందించినట్లు సురేష్ పిళ్లె చెప్పారు. ఫిజిక్స్ సబ్జెక్టులో వెనుకబడిన ఒక విద్యార్థినిని ర్యాంకులు మాత్రమే జీవిత పరమార్థం అని చెబుతూ ఉండే లెక్చరర్ టార్చర్ పెడుతుంటాడు. ఇది తట్టుకోలేక ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడుతుంది. సెలవురోజుల్లో కూడా జూమ్ క్లాసులు అంటూ పిల్లల్ని వేధించే ఆ లెక్చరర్ కు, విద్యార్థిని మరణం తర్వాత భిన్నమైన అనుభవాలు ఎదురౌతాయి. అతనికి ఎదురయ్యే అనుభవాలు ఏమిటి? ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నాడు? అంతిమంగా ఆ వేధింపుల లెక్చరర్ లో వచ్చిన పరివర్తన ఏంటి? అనే దిశగా ఈ చిత్రం సాగుతుంది.

సృష్టిలో ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది అని న్యూటన్స్ థర్డ్ లా చెబుతుంది. మీరు కష్టపడి చదవకపోతే దానికి ప్రతిచర్యగా మీ జీవితాలు నాశనమైపోతాయి అంటూ.. ఫిజిక్స్ లెక్చరర్ పిల్లల్ని టార్చర్ పెడుతుంటాడు. జీవితంలో ప్రతి విషయానికీ న్యూటన్స్ థర్డ్ లా నే ఆపాదించి మాట్లాడుతుంటాడు. అలాంటి లెక్చరర్ చేసిన పాపానికి, న్యూటన్స్ థర్డ్ లా చెప్పినట్టుగానే, ఎదురైన సమానమైన ప్రతిచర్య ఏమిటన్నదే ఈ సినిమా అని సురేష్ పిళ్లె వివరించారు.

ఆదర్శిని చిత్రాలు బ్యానర్ పై భారతమ్మ నిర్మాతగా రూపొందిన చిత్రానికి ఆదర్శిని భారతీకృష్ణ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చేశారు. ప్రధానపాత్రల్లో ఆదర్శిని శ్రీ, ఒబ్బు ప్రసాద్, సూరావజ్ఝుల రాము, పెమ్మరాజు విజయరామచంద్ర, డా.కిరణ్ కుమార్, బాలమురళి తదితరులు నటించారు. సునో యాప్ ద్వారా ఏఐ సహకారంతో స్వరపరిచిన రెండు పాటలకు సాహిత్యాన్ని మునిసురేష్ పిళ్లెనే అందించారు. పదిమంది నటులు ఇందులో తొలిసారిగా నటించారు. ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైన ఈ చిత్రానికి కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం బాధ్యతలను కె.ఎ. మునిసురేష్ పిళ్లె నిర్వహించారు.

Suresh Pillai
The 3rd
short film
Dadasaheb Phalke Film Festival
corporate junior colleges
student suicide
educational pressure
Newton's Third Law
Telugu cinema
Adarshini Chitraalu

More Telugu News